: హైదరాబాదీ మహిళ లోదుస్తుల్లో 2 కిలోల బంగారు బిస్కెట్లు!... ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టివేత!


విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా దేశంలోకి వచ్చేస్తున్న బంగారం రూటు మారినట్లుంది. హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నైలోని ఎయిర్ పోర్టుల్లోనే ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఈ తరహా స్మగ్లింగ్ బంగారం పట్టుబడింది. ఈ రెండు ప్రాంతాల్లో అధికారుల తనిఖీలు ముమ్మరమైన నేపథ్యంలో స్మగ్లర్లు రూటు మార్చేశారు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీని కేంద్రంగా ఎంచుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీకి... అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఈ బంగారాన్ని తరలించేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో నిన్న తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబాయి నుంచి వచ్చిన జెట్ ఎయిర్ వేస్ విమానం నుంచి దిగిన ఓ మహిళపై అక్కడి విమానాశ్రయాధికారులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా... వారి కళ్లు బైర్లు కమ్మాయి. ఏకంగా 2 కిలోల 160 గ్రాముల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో సదరు మహిళ తన లోదుస్తుల్లో దాచేసుకున్న వైనం చూసి నిజంగా అధికారులు కంగుతిన్నారు. దాదాపు రూ.64 లక్షల విలువ చేసే బంగారం మహిళ లోదుస్తుల్లో నుంచి బయటపడటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఆ మహిళ హైదరాబాదుకు చెందిన పర్హత్ ఉన్నీసాగా తేలింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి బంగారాన్ని తరలిస్తున్నారన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ఉన్నీసాను అధికారులు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News