: ప్రాణం తీసిన అభిమానం!...కోలార్ లో పవన్ కల్యాణ్ అభిమాని హత్య!
నిజమే... సినిమా హీరోపై ఉన్న అభిమానం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. మా హీరో గొప్పవాడంటే, కాదు మా హీరో గొప్పవాడంటూ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు చెందిన అభిమానుల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడి ప్రాణం పోయింది. కర్ణాటకలోని కోలార్ లో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో టాలీవుడ్ అగ్ర హీరో, జనసేన అధినేత వపర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని వినోద్ రాయల్ ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకెళితే... పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన తిరుపతి యువకుడు వినోద్ రాయల్ జనసేనకు సంబంధించి నగరంలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. కోలార్ లో పవన్ కల్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి వినోద్ హాజరయ్యాడు. కార్యక్రమం తర్వాత స్నేహితులతో వినోద్ కూర్చోగా... టాలీవుడ్ కే చెందిన ఓ యంగ్ హీరో అభిమాని, వినోద్ మధ్య చర్చ జరిగింది. తమ హీరో గొప్ప అంటే, కాదు తమ హీరో గొప్ప అంటూ వారిద్దిరూ గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆగ్రహావేశాలకు గురైన యంగ్ హీరో అభిమాని వినోద్ ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వినోద్ ను అతడి మిత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వినోద్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చేసేది లేక నిన్న తిరుపతికి వినోద్ మృతదేహాన్ని తీసుకురాగా... అతడి అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు.