: ఆనాడు కరణం మల్లీశ్వరికి సన్మానం చేస్తుంటే చూసి స్ఫూర్తి పొందా: గచ్చిబౌలి స్టేడియంలో పుల్లెల గోపిచంద్
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి సింధుతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్‌ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ.. చిన్నాపెద్దా అంతా తమపై అభిమానం చూపిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ప్రభుత్వానికి ధన్యావాదాలు చెప్పారు. ఆనాడు కరణం మల్లీశ్వరి మెడల్ గెలిచాక ఆమెను ప్రభుత్వం సన్మానం చేసిందని, ఆ కార్యక్రమాన్ని చూసిన తాను ఎంతో స్ఫూర్తిని పొందానని గోపిచంద్ తెలిపారు. ఈరోజు సింధుకి చేస్తోన్న సన్మానాన్ని చూసి ఎంతోమంది చిన్నారులు స్ఫూర్తి పొందుతారని ఆయన అన్నారు. క్రీడాకారులందరూ ఇప్పుడు సింధుని స్ఫూర్తిగా తీసుకుంటారని చెప్పారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షికి హ్యాట్సాఫ్ అని ఆయన అన్నారు. ప్రభుత్వాల నుంచి వస్తోన్న ప్రోత్సాహం ఎంతో బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాలకి ఈ కార్యక్రమం స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.