: ఎన్నికలకు మా దగ్గర డబ్బుల్లేవ్!... గోవాలో ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన!


ఢిల్లీలో గడచిన రెండు ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు అధికార పగ్గాలు చేపట్టిన కొత్త రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని నిధుల లేమి పట్టి పీడిస్తోందట. ఢిల్లీలో ఏడాదిన్నర పాటు పాలన సాగిస్తున్న ఆ పార్టీ ఖాతాలో భవిష్యత్తులో ఏ ఒక్క ఎన్నికలను కూడా ఎదుర్కొనే స్థాయిలో నిధులు లేవట. ఇక ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్యాంకు ఖాతా కూడా ఖాళీగానే ఉందట. ఈ విషయాలు చెబుతున్నది వేరెవరో కాదు... సాక్షాత్తు కేజ్రీవాలే. నిన్న గోవాలోని పణజీలో తన పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ నేతలతో భేటీ అయిన సందర్భంగా కేజ్రీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే పంజాబ్ లో ప్రచారాన్ని ప్రారంభించిన ఆ పార్టీ... తాజాగా గోవాలోనూ ప్రచార హోరును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో కేజ్రీ నిధుల లేమి అంశాన్ని లేవనెత్తారు. గతంలో ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రజలు ఇచ్చిన చందాలతోనే పోటీ చేశామని చెప్పిన ఆయన... ఈ దఫా కూడా అదే బాట పట్టనున్నట్లు పరోక్షంగా ప్రకటించారు. వెరసి ఎన్నికల కోసం నిధులు సేకరించండి అంటూ ఆయన పార్టీ నేతలకు సూచించినట్లైంది.

  • Loading...

More Telugu News