: సింధు విజయోత్సవ ర్యాలీ ప్రారంభం!... డబుల్ డెక్కర్ బస్సుపై సింధు, గోపీచంద్!
రియో ఒలింపిక్స్ లో భారత సత్తా చాటిన స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు విజయోత్సవ ర్యాలీ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. నేటి ఉదయం శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సింధుకు రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ అభిమాన సందోహం కరతాళ ధ్వనుల మధ్య ఎయిర్ పోర్టు బయటకు వచ్చిన సింధు... విజయోత్సవ ర్యాలీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సు టాపు పైకి ఎక్కింది. సింధుతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా బస్సెక్కాడు. ఇక సింధు పక్కన క్రీడారంగానికి చెందిన ప్రముఖుడు చాముండేశ్వరినాథ్ నిలబడగా, గోపీచంద్ పక్కన తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి నిలబడ్డారు. ఎయిర్ పోర్టు నుంచి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ విజయోత్సవ ర్యాలీ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం దాకా కొనసాగనుంది.