: దేశమంతా సింధు ఫైనల్ చూస్తున్నవేళ.. ‘కులం’ కోసం గూగుల్‌లో పెద్ద ఎత్తున వెతుకులాట!
దేశమంతా ఊపిరి బిగబిట్టి సింధు ఫైనల్ మ్యాచ్‌ను తిలకిస్తున్న వేళ కొందరు నెటిజన్లు ఆమె కులం గురించి గూగుల్‌లో వెతుకులాట మొదలు పెట్టారు. సెమీఫైనల్ జరిగిన గురువారం రాత్రి 9:30 గంటలకు, ఫైనల్ జరిగిన శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఇది పతాక స్థాయికి చేరుకుంది. మ్యాచ్ ఫలితం గురించి తెలుసుకోవడం కంటే సింధు కులం గురించి తెలుసుకునేందుకే ఆసక్తి చూపడం గమనార్హం. అయితే ఒక్క మనదేశం నుంచే కాక బహ్రయిన్, ఖతర్, ఒమన్, యూఏఈ, కువైట్ తదితర దేశాల్లోనూ పెద్ద ఎత్తున సింధు కులం గురించి వెతకడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ఈ విషయంలో అత్యధిక ‘సెర్చ్’లతో మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు సింధు కోచ్ పుల్లెల గోపీచంద్‌ను కూడా నెటిజన్లు వదల్లేదు. ‘పుల్లెల గోపీచంద్ క్యాస్ట్’ పేరుతో గూగుల్‌లో విపరీతంగా వెతికారు. గోపీచంద్ కులం గురించి వెతికిన నగరాల్లో విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయి.