: పఠాన్ కోట్, గురుదాస్ పూర్ లలో ఉగ్రవాదుల చొరబాటు... మ్యాసివ్ సెర్చ్ ఆపరేషన్ మొదలు!
పంజాబ్ లోని పఠాన్ కోట్, గురుదాస్ పూర్ ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న వార్తలతో పోలీసులు, సరిహద్దు భద్రతా దళాలు మ్యాసివ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి పలువురు ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారాన్ని అందుకున్న సైన్యం వారిని మట్టుబెట్టేందుకు కదిలింది. దీనానగర్ ప్రాంతంలో వీరు ఓ ట్రక్కులో సంచరిస్తున్నారని సమాచారం రాగా, గత రాత్రి నుంచి స్వాట్ (స్పెషల్ వెపన్స్ అండ్ టాట్కిక్స్ టీమ్) సహా 400 మంది బీఎస్ఎఫ్, పోలీసు సిబ్బంది సోదాలు చేస్తున్నారు. "పఠాన్ కోట్, బటాలా ప్రాంతంలో ఎటువంటి రిస్క్ నూ తీసుకోదలచుకోలేదు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ప్రశ్నిస్తున్నాం. అన్ని వాహనాలనూ సోదాలు చేస్తున్నాం. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్న వాహనాలను చెక్ పోస్టుల వద్ద ఆపి తనిఖీలు చేస్తున్నాం" అని గురుదాస్ పూర్ స్టేషన్ అధికారి వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచినట్టు వివరించారు.