: అమరావతిలో శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు కొన్ని సమస్యలున్నాయి!: చంద్రబాబు
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఈరోజు సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం కొనసాగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు మీడియాకు వివరించారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఛార్జీలు ఇచ్చినట్లు తెలిపారు. పుష్కరాల్లో ఉద్యోగులు, సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది పీఆర్‌సీని అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వర్తింపచేస్తామన్నారు. అమరావతిలో శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు కొన్ని సమస్యలున్నాయని చంద్రబాబు తెలిపారు. మరిన్ని బిల్డింగ్‌లు పూర్తి కావాల్సి ఉందని అన్నారు. హైదరాబాద్‌లోనే వర్షాకాల శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లు ఆమోదిస్తామని పేర్కొన్నారు. ఐటీ విధానంలో మార్పులు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎస్ఆర్ఎమ్ వర్సిటీకి అమరావతిలో 200 ఎకరాల స్థలం కేటాయించినట్లు చెప్పారు. పేదలకు ఇళ్ల కేటాయింపుపై మరో మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. హౌసింగ్ పథకాల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విశాఖను స్మార్ట్ సిటీగా చేసేందుకు కృషి చేస్తామన్నారు.