: తొమ్మిది రోజుల పనితీరు బాగానే ఉంది.. మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాలు తొమ్మిదో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులు పుష్కరాలు కొనసాగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. పుష్కరాల్లో తొమ్మిది రోజుల పనితీరు బాగానే ఉందని, మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పుష్కరాలు చివరి అంకానికి చేరుకున్నాయని, అధికారులు నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల్లో ఇప్పటివరకు 7.5లక్షల మందికి అన్నదానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది కలగకుండా సిబ్బంది తోడ్పాటునందించాలని ఆయన చెప్పారు. పిండప్రదానానికి వస్తున్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు కొనసాగించాలని చంద్రబాబు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖల సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆయన అన్నారు. రేపు పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. బందోబస్తు, రవాణా సౌకర్యాలు, ఆహారం, తాగునీటి సరఫరా ఏర్పాట్లు మరింత పెంచాలని సూచించారు.