: ఏపీలో సీరియల్ నేరాలకు చెక్ పడినట్టే!... నేరగాళ్ల డీఎన్ఏ సేకరణకు చంద్రబాబు సర్కారు శ్రీకారం!
నవ్యాంధ్రప్రదేశ్ లో సీరియల్ నేరగాళ్ల ఆటలిక చెల్లవు. ఎందుకంటే, నేరం జరిగిన వెంటనే ఆ నేరం ఎవరు చేశారన్న విషయాన్ని పోలీసులు ఇట్టే తేల్చేయనున్నారు. ఈ మేరకు నేరగాళ్ల డీఎన్ఏ సేకరణకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టింది. ఏదైనా నేరంలో పట్టుబడిన నేరగాళ్ల డీఎన్ఏను సేకరించనున్న పోలీసులు దానిని పోలీసు రికార్డుల్లో చేరుస్తారు. ఈ తరహా నేరమే కాకుండా మరే నేరమైనా సదరు నేరగాడు చేస్తే... అక్కడ లభించే అతడి ఆనవాళ్లను పట్టేయనున్న పోలీసులు అప్పటికే పోలీసు రికార్డుల్లోని డీఎన్ఏతో దానిని సరిపోల్చి చూస్తారు. దీంతో సీరియల్ నేరగాడెవరన్నది ఇట్టే తేలిపోతుంది. నేరగాళ్ల డీఎన్ఏ సేకరణ వ్యవస్థను ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయం విజయవాడలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు హాజరయ్యారు.