: ఉదయం ఏపీ, సాయంత్రం తెలంగాణ!... ఒకేరోజు తెలుగు రాష్ట్రాల కేబినెట్ భేటీలు!
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో నేడు కేబినెట్ భేటీలు జరగనున్నాయి. నేటి ఉదయం 10 గంటలకు విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుండగా, సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాదులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ కేబినెట్ భేటీలో కృష్ణా పుష్కరాల నిర్వహణ, రెండు రోజుల క్రితం కేంద్రం ప్రకటించిన నిధుల కేటాయింపు, ప్రత్యేక హోదా తదితర అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు పూర్తి కావడం, ఈ అంశంపై నేడు అఖిలపక్షం భేటీ నేపథ్యంలో ఆ అంశంపైనే కేబినెట్ భేటీలో కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇక రియో ఒలింపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధు రజత పతకం సాధించిన నేపథ్యంలో ఆమెకు రెండు కేబినెట్లు అభినందనలు తెలపనున్నాయి.