: చిన్నారులకు పాలు లేవు.. తినడానికి తిండిలేదు.. దుర్భరంగా మారిన కశ్మీర్ ప్రజల జీవనం


అతని పేరు ఖాదిర్ అహ్మద్. కశ్మీర్ లోయలోని దాల్ సరస్సు వద్ద ఉన్న చిన్న గెస్ట్ హౌస్‌లో కేర్ టేకర్‌గా పనిచేస్తున్నాడు. జూలై 4-5 తేదీల వరకు బిజీగా ఉండేవాడు. వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుని ఉన్నంతలో సంతోషంగా గడిపేవాడు. కానీ జూలై 9 తర్వాత అతడి జీవితంలో పెను మార్పులు సంభవించాయి. కర్ఫ్యూ ఎఫెక్ట్ అతడి జీవితంపై పెను ప్రభావం చూపింది. రోజూ వచ్చి ఖాళీగా కూర్చోవడం, ఉత్త చేతులతో ఇంటికి వెళ్లడం. ‘‘రోజు వస్తున్నా. ఖాళీగా కూర్చుని వెళ్తున్నా. ఇలా ఎన్ని రోజులో అర్థం కావడం లేదు. పిచ్చెక్కేలా ఉంది’’ అని వాపోయాడు. ఇది ఒక్క ఖాదిర్ పరిస్థితే కాదు. లోయలోని చిన్నా చితకా వ్యాపారులు, పర్యాటకులపై ఆధారపడి జీవించే వారు అనుభవిస్తున్న వేదన ఇది. జూలై 8న హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం జూలై 9 నుంచి లోయలో కర్ఫ్యూ విధించారు. అల్లర్లు సద్దుమణగకపోవడంతో దానిని పొడిగిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో కర్ఫ్యూ 42వ రోజుకు చేరుకుంది. కర్ఫ్యూ ప్రభావం ప్రజా జీవనంపై పెను ప్రభావం చూపిస్తోంది. ప్రజల్లో అసహనం చోటుచేసుకుంది. మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే అందరికీ కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుందని ప్రజలు చెబుతున్నారంటే వారి దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. కర్ఫ్యూ కారణంగా హోటళ్లు, హౌస్‌బోట్ యజమానులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. తాను గత రెండు వారాలుగా ఇంటికి ఒక్క పైసా కూడా తీసుకెళ్లలేదని ఓ షికారా యజమాని చెప్పాడు. కర్ఫ్యూ ప్రభావం దాల్‌లోని 4వేల షికారాలు, 1200 హౌస్ బోట్లపై పడిందని షికారా యజమాని నజీర్ మొహమ్మద్ తెలిపాడు. 'సాధారణ రోజుల్లో ఒక్కోసారి రూ.3 వేల వరకు ఇంటికి తీసుకెళ్లేవాడిని. ఇప్పుడు చిల్లిగవ్వ కూడా తీసుకెళ్లడం లేదు' అని పేర్కొన్నాడు. బీఎస్ఎన్ఎల్ పోస్టు పెయిడ్ ఫోన్లు తప్ప మరే ఇతర నెట్ వర్క్ పనిచేయకపోవడంతో సమాచార మార్పిడి కూడా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాస్తో కూస్తో కూడబెట్టుకున్న డబ్బులు ఈ నెలరోజుల్లో తిండికి, ఇతర అవసరాలకు అయిపోయాయన్నాడు. ఇక నుంచి పిల్లలకు తిండెలా పెట్టాలని ప్రశ్నించాడు. ఈనెల 25 వరకు లోయలో బంద్ కొనసాగుతుందని వేర్పాటు వాదులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కొనసాగుతున్న కర్ఫ్యూ కారణంగా పాలు కూడా దొరక్క పసిపిల్లలు అల్లాడిపోతున్నారు. ఆహార కొరతతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. అల్లర్లలో గాయపడిన వేలాదిమందితో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. ఏ రాష్ట్రంలో అయినా 42 రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగిందా? మనమెక్కడికి పోతున్నాం? అని కశ్మీర్ పౌరులు బాధగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వీరికి ఏమని సమాధానం చెబుతుందో!

  • Loading...

More Telugu News