: పెల్లెట్లు వాడొద్దంటే...తుపాకులు వాడాల్సి వస్తుంది: హైకోర్టుకు చెప్పిన సీఆర్పీఎఫ్
ఆందోళనకారులను నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్ వాడొద్దని ఆదేశిస్తే... తమ ముందు తుపాకులు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉంటాయని జమ్మూకాశ్మీర్ హైకోర్టుకు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పెల్లెట్ గన్స్ వాడకుండా నియంత్రించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సందర్భంగా పెల్లెట్ గన్స్ వాడాల్సిన అవసరాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు హైకోర్టుకు తెలిపారు. పెల్లట్ గన్స్ ను నియంత్రిస్తే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు తమ ముందు తుపాకులు మాత్రమే ప్రత్యామ్నాయమవుతాయని, తద్వారా ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. నిబంధనల ప్రకారం తుపాకుల వినియోగం సందర్భంగా ఆందోళనకారుల నడుం కింది భాగంలో కాల్చాల్సి ఉంటుందని, అటూ ఇటూ పరుగెడుతూ ఆందోళన రేపే వారిని గురి చూసి నడుం కింది భాగంలో కాల్చడం సాధ్యపడకపోవచ్చని, అలాంటి సందర్భాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేశారు. జూలై 9 నుంచి ఆగస్టు 11 వరకు ఆందోళనకారులను అణచివేసేందుకు 3,500 పెల్లెట్ కాట్రిడ్జ్ లను వాడామని వారు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తమ వాదన వినిపించాల్సిఉంది.