: ఆప్‌లో చేరే విషయంపై ఆలోచించుకోవడానికి సిద్ధూ కాస్త సమయం అడిగారు!: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే విషయంలో మాజీ క్రికెటర్ సిద్ధూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు స్పందించారు. గత కొన్నాళ్లుగా సిద్ధూ తమ పార్టీలో చేరతాడనే వార్తలు వింటున్నానని, అందుకని ఈ అంశంపై స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అటువంటి మంచి క్రికెటర్ తమ పార్టీలో చేరితే తమకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. సిద్ధూ తనను వారం రోజుల క్రితమే కలిశారని, తమ పార్టీలో చేరే విషయంపై ఆలోచించుకోవడానికి సిద్ధూ తనను కొంత వ్యవధి కావాలని అడిగారని ఆయన తెలిపారు. సిద్ధూ తీసుకునే నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని, సిద్ధూ చాలా మంచి వ్యక్తని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినా, చేరకపోయినా ఆయనపై ఉన్న గౌరవం తమలో తగ్గదని తెలిపారు.