: నాకు... ఇంత కంటే మధురమైన రాఖీ పండగ లేదు: సాక్షి మాలిక్ సోదరుడు
తనకు ఇంతకంటే మధురమైన రాఖీ పండగ లేదని రియో ఒలింపిక్స్ లో పతకం సాధించిన సాక్షి మాలిక్ సోదరుడు సచిన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇంతకంటే గొప్ప కానుకను ఏ చెల్లీ ఏ అన్నకూ ఇచ్చి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. తన చెల్లెలు దేశ గౌరవాన్ని నిలబెట్టిందని, అంతకంటే తనకు ఇంకేం కావాలని ఆయన ఉప్పొంగిపోయారు. ప్రతి ఆడపిల్ల కుటుంబాన్ని గర్వించేలా చేస్తుందని, తన చెల్లెలు మాత్రం కుటుంబంతో పాటు యావద్భారత దేశాన్ని గర్వించేలా చేసిందని ఆయన మురిసిపోయారు. పతకం గెలవాల్సిన అవసరాన్ని తన చెల్లెలికి చెబుతూ పోటీకి ముందు ఓ మెసేజ్ పంపానని, విజయం సాధించిన తరువాత అన్నగా ఆ విజయాన్ని ఎంతెలా ఆస్వాదించినదీ, తన చెల్లెలంటే తనకు ఉన్న ఆప్యాయతను తెలియజేస్తూ ఒక మెసేజ్ పంపానని ఆయన తెలిపారు. కాగా, పతకం సాధించిన సాక్షిని అభినందిస్తూ ఆమెకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.