: గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి ఎదుట ఎస్సై రామకృష్ణారెడ్డి బంధువుల ఆందోళన
మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లిలోని పోలీస్ క్వార్టర్స్ లో ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన బంధువులు మెదక్‌లోని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పైఅధికారుల వేధింపుల కారణంగానే తాను చనిపోతున్నట్లు రామకృష్ణారెడ్డి ఆత్మహత్య లేఖ రాశారని, అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రామకృష్ణా రెడ్డి బంధువుల ఆందోళనకు మద్దతుగా టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రజల సొమ్ము దోచుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎంతో అవినీతి జరుగుతోందని అన్నారు. ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కుకునూరు పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య కేసు నమోదయింది.