: డిప్యూటీ కలెక్టర్ పై చేయి చేసుకున్న ఎన్సీపీ ఎమ్మెల్యే!... వైరల్ గా మారిన వీడియో!
విధి నిర్వహణలో ఉన్న అధికారులపై రాజకీయ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. కార్యాలయాల్లోకి చొచ్చుకువెళుతున్న నేతాశ్రీలు... అక్కడి అధికారులను ఎడాపెడా వాయించేస్తున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని రాయిగడ్ లో గతవారం చోటుచేసుకుంది. కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకెళితే... కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ఆధ్వర్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన నేత, కర్జాత్ ఎమ్మెల్యే సురేశ్ లాడ్ రాయిగడ్ లోని డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో వీరంగమాడారు. నేరుగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన లాడ్... అక్కడ విధి నిర్వహణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. అదే వూపులో అక్కడి ఓ అధికారి చెంప చెళ్లుమనిపించిన లాడ్... డిప్యూటీ కలెక్టర్ పైనా చేయి చేసుకున్నారు. ‘ప్లీజ్ ఆపండి.. ప్లీజ్ ఆపండి’ అంటూ సదరు డిప్యూటీ కలెక్టర్ వేడుకున్నా... లాడ్ మాత్రం తన ప్రతాపాన్ని ఆపలేదు.