: హెల్మెట్ లేకుండా కేంద్రమంత్రుల బైక్ రైడింగ్.. తప్పు కదా అంటే, తలపాగా ఉందిగా? అన్న అమాత్యులు
హెల్మెట్ల వాడకంపై ఓవైపు ప్రభుత్వం నెత్తీనోరు బాదుకుని ప్రచారం చేస్తుంటే స్వయంగా కేంద్రమంత్రులే దీనిని ఉల్లంఘించారు. జైపూర్‌లో మంగళవారం నిర్వహించిన ‘తిరంగా యాత్ర’లో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. కతిపుర నుంచి ధాంక్యా వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రులు హెల్మెట్ లేకుండానే సవారీ చేశారు. కార్యక్రమం అనంతరం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనపై విలేకరులు వారిని ప్రశ్నించారు. హెల్మట్ ధరించకుండా బైక్ నడపడం నేరం కాదా? అని నిలదీశారు. దీంతో స్పందించిన మంత్రులు చెప్పిన సమాధానం విని మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. హెల్మెట్ లేకున్నా తలపాగా ధరించి నడిపితే ఏం కాదన్నారు. చట్ట ప్రకారం తలపాగా ధరించి బైక్ నడపవచ్చని సెలవిచ్చారు. చాలా కాలం తర్వాత బైక్ నడపడం ఎంతో బాగుందంటూ గోయల్ పేర్కొన్నారు. అప్పుడెప్పుడో ఓ ర్యాలీలో నితిన్ గడ్కరీ వెనక బైక్‌పై కూర్చున్నట్టు తెలిపారు. 2014లో గడ్కరీ కూడా హెల్మెట్ లేకుండా బైక్ నడిపి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన విషయం తెలిసిందే. కాగా బైక్ నడిపిన మంత్రులకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన విషయం తెలిసి ఉండకపోవచ్చని పోలీసులు చెప్పడం గమనార్హం.