: కానిస్టేబుళ్లకు ఫోన్ చేసి గోడు వెళ్లబోసుకున్న రామకృష్ణారెడ్డి!... కొలీగ్ వచ్చేలోగానే కాల్చేసుకున్న వైనం!
మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు రామకృష్ణారెడ్డి ఓ సూసైడ్ లేఖ రాశారు. ఈ లేఖ పోలీసు శాఖలో పెను కలకలమే రేపుతోంది. తాజాగా ఆత్మహత్యకు ముందు రామకృష్ణారెడ్డి తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనట్లు తెలుస్తోంది. తనను ఉన్నతాధికారులు వేధిస్తున్న వైనాన్ని మననం చేసుకున్న ఆయన... తన కింద పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకున్నారు. బాసుల వేధింపులను తాళలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన వారితో చెప్పారట. రామకృష్ణారెడ్డిని వారించే యత్నం చేస్తూనే సదరు కానిస్టేబుళ్లు... అక్కడికి సమీపంలోని గజ్వేల్ ఎస్సైగా ఉన్న కమలాకర్ కు సమాచారం చేరవేశారు. ఈ క్రమంలో వేగంగా స్పందించిన కమలాకర్ నేరుగా రామకృష్ణారెడ్డికి ఫోన్ చేశారట. వేధింపులపై మాట్లాడదామని, తానిప్పుడే బయలుదేరి వస్తున్నానని, తాను వచ్చే దాకా ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోరాదని కమలాకర్ ఆయనను కోరారు. సహచర ఉద్యోగి చెప్పిన మాటలు కూడా రామకృష్ణారెడ్డికి సాంత్వన చేకూర్చలేకపోయాయి. ఫోన్ పెట్టేసి కారెక్కిన కమలాకర్ కుకునూరుపల్లికి చేరుకునేలోగానే రామకృష్ణారెడ్డి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని విగత జీవిగా మారిపోయారు. తనతో కొద్దిసేపటి క్రితం ఫోన్ లో మాట్లాడిన తన సహచర ఉద్యోగి అంతలోనే నిర్జీవంగా మారిపోయిన వైనం కమలాకర్ ను కలచివేసింది.