: ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటా!... ‘హోదా’పై వైఖరి స్పష్టం చేసిన చంద్రబాబు!


ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై కేంద్ర ప్రభుత్వం అస్పష్ట వైఖరితో ముందుకెళుతుండగా... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మాత్రం స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతున్నట్లు తేలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇబ్బంది లేకున్నా... ఏపీకి ఇస్తే మరో 11 రాష్ట్రాలు తమపై ఒత్తిడి తెస్తాయని భయపడుతున్న కేంద్రం వెనకడుగు వేస్తోంది. అయితే కేంద్రం ఎంతమేర కాలయాపన చేసినా... తన వైఖరిలో మాత్రం మార్పు రాదని చంద్రబాబు తేల్చేశారు. పుష్కరాల కవరేజీ కోసం జాతీయ మీడియాకు చెందిన పలువురు ప్రతినిధులు నిన్న విజయవాడ వచ్చారు. ఆ సమయంలో పుష్కరాల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ లో ఉన్న చంద్రబాబును వారు కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు రాగా... చంద్రబాబు తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లానని, ప్రధాని సహా పలువురు మంత్రుల వద్ద తన వాదన వినిపించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించేదాకా ఢిల్లీ వెళుతూనే ఉంటానని, కేంద్రాన్ని అడుగుతూనే ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు. అయినా ఏపీ ప్రజల అభీష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని విభజించిన కేంద్రానికి ఆ రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరచాల్సిన అవసరం లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 'ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజల మనోభావాలను ఢిల్లీలోని కేంద్రం పెద్దలకు అర్థమయ్యేలా చూడండి' అంటూ ఆయన ఢిల్లీ మీడియాను కోరారు.

  • Loading...

More Telugu News