: రియో ఒలింపిక్స్ లో స్విమ్మింగ్ పూల్స్ ఆకుపచ్చగా మారడం వెనుక కారణం ఇదీ!
రియో ఒలింపిక్స్ సందర్భంగా జికా వైరస్ పై భయంతో బిక్కుబిక్కుమంటూనే క్రీడాకారులు బ్రెజిల్ లో అడుగుపెట్టారు. బ్రెజిల్ సముద్ర జలాల్లో కాలుష్యం పెరిగిందని, జికా వైరస్ వ్యాప్తి చెందేది ఇక్కడి సముద్ర జలాల కారణంగానే... అంటూ పలు కథనాలు వెలువడడంతో జల క్రీడాకారులు బెంబేలెత్తిపోయారు. స్విమ్మింగ్ పూల్ లో నీలం రంగులో ఉండాల్సిన నీరు ఆకుపచ్చగా మారడానికి తోడు, కళ్ల మంటలు, దురద పుట్టడంతో ఆ భయం మరి కాస్త పెరిగింది. దీంతో భయం భయంగానే ఈ క్రీడాకారులు స్విమ్మింగ్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, ఆ నీరు ఆకుపచ్చగా మారడం వెనుక గుట్టు విప్పేందుకు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. ఒలింపిక్ సంఘానికి చెందిన ఫినా అధికారులు నీటిలో పెరిగే ఆల్గే (శిలీంద్రాలు- నీటిలో పెరిగే నాచు) పెరగడం, గాలి, వెలుతురు లేని ప్రాంతంలో నీటిని ఉంచడం కారణంగా రంగు మారిందని తెలిపారు. అయితే అందుకు గల శాస్త్రీయతను వివరించడంలో వారు విఫలమయ్యారు. ఈ క్రమంలో బ్రెజిల్ లోని ఓ యూనివర్సిటీలో వాటర్ కెమిస్ట్రీ చదువుతూ, స్విమ్మింగ్ పూల్ బాయ్ గా పనిచేసిన 'జీఆర్ఆర్ఎల్ సైంటిస్ట్' నీరు ఆకుపచ్చగా మారడం వెనుక గుట్టును విప్పారు. స్విమ్మింగ్ పూల్ లో ఆల్గే కారణంగా నీటిరంగు మారలేదని, వాస్తవానికి నీటిలో ఆల్గే పెరగడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని, ఒలింపిక్స్ నిర్వహించే స్విమ్మింగ్ పూల్ లో ఆల్గే పెరిగే అవకాశం లేదని అన్నారు. అలాగే అధికారులు చెబుతున్నట్టు గాలి, వెలుతురు ప్రసరించకపోవడం కూడా నీటి రంగు మార్పుకు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. నీలిరంగులో ఉండే కాపర్ సల్ఫేట్ లేదా కాపర్ సల్ఫేట్ పెంటా హైడ్రేట్ ను అధిక మొత్తంలో ఉపయోగించడం వల్ల నీరు ఆకుపచ్చ రంగులోకి మారిపోయి ఉంటుందని అన్నారు. స్విమ్మింగ్ పూల్, అతి పెద్ద వాటర్ ట్యాంకుల నీటిలో ఆల్గే పెరగకుండా ఉండేందుకు కాపర్ సల్ఫేట్ ను వినియోగిస్తారని ఆయన చెప్పారు. ఈ సల్ఫేట్ ను సరైన మోతాదులో కలపాల్సి ఉంటుందని, అలా సరైన మోతాదులో కలిపితే మానవ ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదని, చేపలు లాంటి జలచరాలు పెరగవని అన్నారు. దీనిని ఎక్కువ మోతాదులో కలిపితే మాత్రం కొన్ని దుష్పరిణామాలుంటాయని, మనిషి శరీరంపై దురదలు లేస్తాయని, కళ్లు మండుతాయని ఆయన తెలిపారు. కాగా, పోటీల సందర్భంగా పలువురు క్రీడాకారులు కళ్లు మండడం, దురదలపై ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. కాపర్ సల్ఫేట్ ను ఎక్కువ మొత్తంలో నీటిలో కలపడం వల్ల నీలిరంగులో ఉండే కాపర్ అయాన్లు నీటిలోని నాలుగు క్లోరిన్ అయాన్లతో కలసి కాపర్ (2) టెట్రాక్లోరో కాంప్లెక్స్గా మారుతుందని అన్నారు. కాపర్ టెట్రాక్లోరో కాంప్లెక్స్ ఆకుపచ్చగా ఉండడంతో నీరు కూడా ఆకుపచ్చగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.