: వాళ్లింట్లో అన్నం తిన్నామన్న విశ్వాసం కూడా లేని నయవంచకుడు నయీమ్: చిన్ననాటి స్నేహితుడు రామకృష్ణ
కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే నయవంచకుడని అతని చిన్ననాటి స్నేహితుడు రామకృష్ణ అన్నారు. భువనగిరికి చెందిన రామకృష్ణ, నయీమ్ చిన్నతనంలో ఒకే స్కూల్, కళాశాలలో చదువుకున్నారు. అతని గురించి ఆయన మాట్లాడుతూ, నయీమ్ చిన్నతనంలో తమ ఇంట్లో చాలాసార్లు భోజనం చేశాడని చెప్పారు. కాలేజీలో దూకుడుగా వుండేవాడని ఆయన తెలిపారు. మాట్లాడితే గొడవలకు దిగేవాడని, స్నేహితులను బెదిరించేవాడని ఆయన చెప్పారు. ఎవరైనా ఎదురు తిరిగి దాడి చేస్తే కొంత మంది స్నేహితులను వేసుకుని, పాములతో వారిని బెదిరించేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. సాధారణంగా ఎవరి దగ్గరైనా భోజనం చేస్తే వారిపై కృతజ్ఞత చూపిస్తామని, అయితే నయవంచకుడు నయీమ్ కు అలాంటి సెంటిమెంట్లు లేవని ఆయన పేర్కొన్నారు. భువనగిరిలో తమ బంధువులకు సంబంధించిన 13 ఎకరాల భూమిని ఆక్రమించిన నయీమ్ పై వారు ఒత్తిడి తెచ్చారని ఆయన తెలిపారు. దీంతో తన ప్రోద్బలంతోనే వారు అతనిపై ఒత్తిడి తెచ్చారని భావించిన నయీమ్ తనపై అటాక్ చేశాడని, అతను కత్తులతో దాడి చేయడంతో తన తలపై 13 కుట్లుపడ్డాయని, కడుపులో కత్తిదిగిందని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే దేవుడి దయవల్ల బతికి బట్టకట్టానని ఆయన చెప్పారు. ఆ తరువాత హైదరాబాదులో తన తమ్ముడు ఆఫీసుకు వెళ్లేందుకు బయటకు రాగా, గేటు బయట అతనిపై కత్తులతో దాడిచేసి హతమార్చారని ఆయన తెలిపారు. ఆ తరువాత నయీమ్ తో తమ స్నేహితులు మాట్లాడారని, ఆ తర్వాత వారు తనతో చెబుతూ... 'అతనితో విరోధం ఎందుకురా? ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకో' అని సలహా ఇచ్చారని, వారి సలహాను అనుసరించి కొంత డబ్బులిచ్చి తమ జోలికి రాకుండా సెటిల్ చేసుకున్నామని ఆయన చెప్పారు. తాను సెటిల్ మెంట్ కు వెళ్లిన సమయంలో నయీమ్ ఇంటి పరిసరాల్లో 10 మంది తుపాకులతో పహారా కాసేవారని, నయీమ్ దగ్గర నలుగురు యువతులు తుపాకులు పట్టుకుని కాపలా కాసేవారని ఆయన చెప్పారు. అందరి దగ్గరా 9ఎంఎం తుపాకులు ఉన్నాయని ఆయన తెలిపారు. తనతో పెట్టుకుంటే ఎంతటి వారినైనా మట్టుపెడతానని, తన వెనుక ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారని బెదిరించేవాడని ఆయన చెప్పారు. అయితే హత్యలు చేసేవాడు ఎప్పటికైనా హత్యకు గురికావాల్సిందేనన్నట్టు...నయీమ్ వంద పాపాలు పండిపోవడంతో తుపాకీకి బలయ్యాడని ఆయన అన్నారు. అయితే నయీమ్ పోయినా నయీమ్ సామ్రాజ్యం అలాగే ఉందని, అతని అనుచరులందర్నీ ఎన్ కౌంటర్లో ఏరి వేస్తే కానీ అది నాశనం కాదని, అంతవరకు ధైర్యంగా ఉండొచ్చన్న భరోసా లేదని ఆయన తెలిపారు.