: అసోం నుంచి బంగ్లాదేశ్ వరకూ బ్రహ్మపుత్ర వరదలో ఈదుకుంటూ వెళ్లి మరణించిన ఏనుగు... కన్నీరు మున్నీరైన ప్రజలు!
బంగ బహదూర్... అసోంలోని ధుబ్రి జిల్లాలో పెరిగిన ఏనుగు. ఇదంటే ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలందరికీ ఎంతో ఇష్టం. అటువంటి బంగ బహదూర్, నెలన్నర క్రితం వచ్చిన బ్రహ్మపుత్ర వరదల్లో చిక్కుకుంది. ఆ వరద నీటిలోనే ప్రాణాలు కాపాడుకుంటూ బంగ్లాదేశ్ చేరుకుంది. ఈ ఏనుగు ఢాకా సమీపంలోని ఓ కొలనులోని మురుగు నీటిలో చిక్కుకుని పైకి రాలేక అవస్థలు పడుతున్న వేళ, ఆగస్టు 11వ తేదీన చూసిన బంగ్లాదేశ్ అటవీ శాఖ అధికారులు, దాన్ని పార్కుకు తరలించాలని ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు. మరింతగా మునగకుండా తాళ్లు, చైన్లు కట్టి ఉంచారు. ఆహారం ఇచ్చినా తినకుండా నీరసించిన ఏనుగు చివరికి మరణించింది. బంగ్లాదేశ్ లోని అధిక ఉష్ణోగ్రతలను ఈ రకం ఏనుగులు తట్టుకోలేవని చెప్పిన అధికారులు, పోస్టుమార్టం చేసి దీని మరణానికి అసలు కారణాన్ని కనుగొంటామని చెప్పారు. ఇక తామెంతో ప్రేమగా పెంచుకున్న బంగ బహదూర్ ఇక లేదని తెలుసుకున్న ధుబ్రి వాసులతో పాటు, ఏనుగు అవస్థను నాలుగు రోజుల పాటు చూసిన బంగ్లా వాసులూ కన్నీరు పెట్టుకున్నారు.