: వికాస్ కూడా వచ్చేశాడు... ఆశలన్నీ శ్రీకాంత్, సింధూలపైనే!
రియో ఒలింపిక్స్ లో కనీసం కాంస్యం తెస్తాడని అభిమానులు భావించిన బాక్సర్ వికాస్ కృష్ణన్ నిరాశపరిచే ప్రదర్శనతో మిగతా అందరు ఆటగాళ్ల దారిలోనే నడిచి వెనుదిరిగాడు. ఇక ఇండియాకు మిగిలిన ఆశలన్నీ షటిల్ క్రీడాంశంలో కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధూలపైనే. వీరిద్దరూ ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ లో చోటు దక్కించుకున్నారు. గత రాత్రి జరిగిన పోటీలో శ్రీకాంత్ వరల్డ్ నంబర్ 11 ర్యాంకర్, డెన్మార్క్ ఆడగాడు జార్జెన్ సేన్ పై 21-19, 21-19 తేడాతో 42 నిమిషాల్లోనే విజయం సాధించాడు. ఆపై అర్ధరాత్రి జరిగిన మరో మ్యాచ్ లో పీవీ సింధు తైపేకు చెందిన ట్జూ యింగ్ ను 21-13, 21-15 తేడాతో ఓడించింది. వీరిద్దరూ స్వర్ణ పతకాలకు మరో మూడు అడుగుల దూరంలో ఉన్నారు. మహిళల 3000 మీటర్ల స్టిపుల్ చేజ్ లో పోటీ పడ్డ లలితా బాబర్, తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినప్పటికీ, 10వ స్థానానికి మాత్రమే పరిమితమైంది. మహిళల 200 మీటర్ల ప్రిలిమ్స్ లో శర్వానీ నందా నిరాశ పరుస్తూ, 55వ ర్యాంకుకు పరిమితమైంది. రియో ఒలింపిక్స్ పోటీలు ముగిసేందుకు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. ఏ పతకమూ రాకుండా మనవారంతా వెనక్కు వస్తే, 1992 తరువాత ఒలింపిక్స్ లో పతకం లేకుండానే ఇండియా వెనక్కు వచ్చినట్లవుతుంది.