: పుష్కరాలకు వస్తూ పురోహితుడు... రైల్వే స్టేషన్లో తోపులాటలో రైలు కింద పడి ప్రయాణికుడు మృతి!
కృష్ణమ్మ పుష్కరాల ఐదో రోజున అపశ్రుతులు దొర్లాయి. పుష్కరాల్లో పిండ ప్రదాన విధులకు వస్తున్న పురోహితుడు గుండెపోటుతో మృతి చెందగా, గుంటూరు రైల్వే స్టేషనులో జరిగిన తొక్కిసలాటలో పల్నాడు ఎక్స్ ప్రెస్ కింద పడి ఓ ప్రయాణికుడు మరణించారు. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన సూరే రంగారావు పుష్కర విధుల కోసం ఇబ్రహీపట్నం దగ్గరి కృష్ణా, గోదావరి సంగమ ఘాట్ కు బస్సులో వస్తూ కుప్పకూలాడు. బాధితుడిని ప్రథమ చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. గడచిన నాలుగు రోజులుగా రంగారావు సంగమ ఘాట్ వద్దే పిండ ప్రదాన పనులు చూసుకుంటున్నారు. మరో ఘటనలో గుంటూరు రైల్వే స్టేషన్ లో పల్నాడు ఎక్స్ ప్రెస్ వచ్చిన వేళ, తొక్కిసలాట జరిగింది. దీంతో రైలు కిందపడి నాగేశ్వరరావు అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల మండలం మాచారం సమీపంలో పుష్కర యాత్రికులతో వెళుతున్న బస్సు బోల్తా పడగా, పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.