: పాతబస్తీలో బీహార్ గన్ కల్చర్.. శునకాలపై కాల్పులు


బీహార్ గన్ కల్చర్ భాగ్యనగరానికి పాకింది. టప్పాచబుత్ర ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో శునకాలపై కాల్పుల ఘటన కలకలం రేపింది. అక్బర్ ముజాహిదీన్ అనే ఫామ్ హౌస్ యజమాని ఎయిర్ పిస్టల్‌తో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడి కాల్పుల్లో గాయపడిన కుక్కలు భయంతో అరుస్తూ వీధుల వెంట పరుగులు తీస్తూ ప్రాణాలు కోల్పోయాయి. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గన్ పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకా? లేక గన్ షూటింగ్ ప్రాక్టీసులో భాగంగా అక్బర్ ఈ కాల్పులకు తెగబడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనుషులకు అత్యంత విశ్వాసపాత్రులుగా పేరు తెచ్చుకున్న శునకాలు అదే మనుషుల కిరాతకానికి బలైపోతున్నాయి. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు దీనిని రుజువు చేస్తున్నాయి. తాజాగా పాతబస్తీలో శునకాలపై కాల్పులు కలకలం రేపుతుండగా ఇటీవల రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో కూడా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ ఫామ్‌హౌస్ యజమాని తనయుడు ఓ కుక్కను అతి దగ్గరి నుంచి కాల్చి చంపాడు. ఈ వీడియో వైరల్ అయింది. మరో ఘటనలో ముషీరాబాద్‌లో కొందరు వ్యక్తులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. కుక్క పిల్లలను మంటల్లో వేసి సజీవ దహనం చేశారు. చెన్నైలో జరిగిన ఇంకో ఘటనలో కొందరు మెడికోలు ఉన్మాదుల్లా వ్యవహరించారు. ఓ శునకాన్ని మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందికి పడేసి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జంతువులపై దాడులు పెరిగిపోతుండడంతో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News