: ఎన్నారైలూ నయీమ్ బాధితులే!.. సిట్ కంట్రోల్ రూంకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
కలుగులోని ఎలుకల్లా నయీమ్ బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తామూ నయీమ్ బాధితులమేనంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సిట్ కంట్రోల్ రూంకు బాధితుల నుంచి ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. పూటపూటకు వీటి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే వందకు పైగా కాల్స్ రాగా ఒక్క సోమవారం నాడే మూడు ఫిర్యాదులు అందాయి. ఇంకొందరు బాధితులు ఈమెయిళ్లలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ నుంచి తాము ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెడుతున్నారు. ఇక నయీమ్ బాధితుల్లో పలువురు ఎన్నారైలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా వెళ్లి బాగా సంపాదించిన ఓ ఎన్నారై నల్గొండలో వ్యాపారం చేసేందుకు వచ్చి నయీమ్ దృష్టిలో పడ్డాడు. దీంతో రూ.50 లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో మరెందరు ఎన్నారైలు క్యూలో ఉన్నారోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నయీమ్ స్థావరాల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పట్టుబడిన నయీమ్ డ్రైవర్ శ్యామ్యూల్ నుంచి స్థావరాల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నార్సింగి ప్రాంతంలో ఐదు ఇళ్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు భూ దందాలు, సెటిల్‌మెంట్ల ద్వారా వచ్చిన డబ్బును అక్కడ దాచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.