: పుష్కరాలకు పోటెత్తుతున్న భక్తులు.. నాలుగు రోజుల్లో ఏపీలో 54 లక్షమంది పుణ్యస్నానాలు
కృష్ణమ్మ పరవళ్లు చూసి భక్తజనం పులకించిపోతోంది. భక్తితో మునకలు వేసి తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పుష్కరాలు జోరుగా సాగుతున్నాయి. వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని వివిధ ఘాట్లకు భక్తులు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఘాట్లలో దాదాపు 54 లక్షల మంది స్నానాలు ఆచరించారు. ఒక్క విజయవాడలోనే సోమవారం ఏడు లక్షలమందికి పైగా స్నానాలు ఆచరించారు. నాలుగు రోజుల్లో విజయవాడలో 24 లక్షలమంది పవిత్ర స్నానాలతో పునీతులయ్యారు. మరోవైపు కృష్ణా హారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు వేచి ఉంటున్నారు. పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు కృష్ణమ్మకు సమర్పిస్తున్న సంధ్యా పుష్కరహారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్క సంగమ ఘాట్ వద్దే కాకుండా అమరావతిలోనూ కృష్ణమ్మకు సంధ్యాహారతి సమర్పిస్తున్నారు.