: ఎన్టీఆర్ తరువాత గొప్ప నేత కేసీఆర్: మోహన్ బాబు
కరీంనగర్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజశ్వేర స్వామి ఆలయాన్ని ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తాను త్వరలో నిర్మించనున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్టును అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నారు. స్వామివారిని మోహన్ బాబుతో పాటు ఆయన కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు మంచు మనోజ్ కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తరువాత గొప్ప నేత కేసీఆర్ అని అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ప్రజల అదృష్టమని ఆయన చెప్పారు. కేసీఆర్ మెరుగైన పాలన అందిస్తున్నారని ఆయన కితాబునిచ్చారు.