: నయీమ్ తో సంబంధం కలిగిన పోలీసు అధికారులు, రాజకీయ నాయకులను శిక్షించాలి: మావోయిస్టు నేత జగన్
నయీమ్ ఎన్ కౌంటర్ పై తొలిసారి మావోయిస్టులు స్పందించారు. నయీమ్ ఎన్ కౌంటర్ అయిన ఇన్ని రోజుల తరువాత మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటనలో బెల్లి లలితను హత్య చేయించేందుకు నాటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి నయీమ్ ను తయారు చేశారని ఆయన చెప్పారు. నయీమ్ తో బెల్లి లలితను 18 ముక్కలుగా నరికించారని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కోస్తాంధ్ర పాలకులు నయీమ్ ను ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు. కనకాచారి సహా పలువురు ప్రజా సంఘాల నేతలను పోలీసుల మద్దతుతో నయీమ్ హత్యలు చేశాడని ఆయన పేర్కొన్నారు. పోలీసులు స్వార్థ ప్రయోజనాల కోసం నయీమ్ ను వాడుకున్నారని ఆయన ఆరోపించారు. నక్సల్స్ కు వ్యతిరేకంగా నయీమ్ ను ఉపయోగిస్తున్నామన్న సాకుతో పోలీసు అధికారులు ప్రజా సంఘాల నేతలను హతమార్చారని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నయీమ్ ముఠా సభ్యులందర్నీ అరెస్టు చేయాలని ఆయన సవాలు విసిరారు. నయీమ్ ముఠాతో సంబంధం ఉన్న పోలీసు అధికారులు, రాజకీయ నాయకులను అరెస్టు చేసి, శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.