: పతకం గెలిచిన క్రీడాకారిణికి రియోలో పెళ్లి ప్రపోజల్... ఆనందంతో అంగీకరించిన చైనా చిన్నది!
రియో ఒలింపిక్స్ లో భాగంగా త్రీ మీటర్ స్ప్రింగ్ బోర్డ్ డైవింగ్ పోటీల్లో చైనా క్రీడాకారిణి హెజీ (25) సిల్వర్ మెడల్ సాధించిన వేళ, ఓ ఆసక్తికరమైన సన్నివేశం లైవ్ కెమెరాలకు చిక్కింది. హెజీ పతకం సాధించి కిందకు దిగగానే, చైనాకే చెందిన డైవింగ్ ఆటగాడు కిన్ కై (30) ఆమె ముందుకు వచ్చాడు. మోకాళ్లపై కూర్చుని ఓ చిన్న బాక్స్ ను ఆమెకు ఇచ్చాడు. దాన్ని తెరచి చూసిన హెజీ ఆనందంతో కూడిన ఆశ్చర్యానికి లోనైంది. అది నిశ్చితార్థపు ఉంగరం. తనను పెళ్లి చేసుకోవాలన్న కిన్ కై కోరికను ఆమె ఆనంద బాష్పాలతో అంగీకరించగా, దీన్ని తిలకిస్తున్న వేలాది మంది చప్పట్లు, కేరింతలతో అభినందించారు. హెజీ పతకం సాధిస్తుందని గట్టిగా నమ్మిన కిన్ కై, ఆపై తాను ప్రపోజ్ చేయాలని ముందుగానే ఉంగరాన్ని సిద్ధం చేసుకుని రావడం ఆమెపై అతనికున్న నమ్మకానికి నిదర్శనమని సహచర ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. అదే అతని ప్రేమను విజయవంతం చేసిందని అన్నారు.