: వినూత్న ఆలోచనకు ఆర్థిక సాయం... స్టార్టప్ ఫండ్ ను ప్రారంభించిన ఓఎన్జీసీ
భారత చమురు, సహజవాయు రంగంలో వినూత్న ఆలోచనలతో వచ్చే వారికి అవసరమయ్యే ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ రూ. 100 కోట్లతో స్టార్టప్ ఫండ్ ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'స్టార్టప్ ఇండియా' కార్యక్రమానికి మద్దతుగా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో మరింత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, సంస్థ వజ్రోత్సవాల వేళ ఈ ఫండ్ ను ప్రారంభించామని ఓఎన్జీసీ సీఎండీ దినేష్ కే సరాఫ్ వ్యాఖ్యానించారు. ఈ రంగంలో సాంకేతికత ఆధారిత ఆలోచనలకు తాము పూర్తి మద్దతిస్తామని తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న ముగ్గురు యువ అధికారులు రాజేంద్రబాబు, దీపక్ నాయక్, ప్రజేష్ చోప్రాలు వినూత్న ఆలోచనలతో వచ్చారని వీరికి అవార్డులు ఇచ్చామని తెలిపారు. రాజేంద్ర, దీపక్ లు రిగ్గుల రక్షణకు సేఫ్టీ పరికరాల ఆలోచనలు చేశారని, వీరి మది నుంచి వచ్చిన ఎమర్జన్సీ బ్రేక్ వ్యవస్థ తయారీకి నిధులందించాలని నిర్ణయించామని, ప్రజేష్, ఓఎన్జీసీ కోసం డ్యూయల్ సిమ్ సెల్యులార్ రూటర్ సిస్టమ్ ను తయారు చేసి, అన్ని రిగ్గుల వద్దా డేటా కనెక్టివిటీని సులభం చేశాడని తెలిపారు. దీనివల్ల ఎంతో సమయం, డబ్బు ఆదా అయ్యాయని దినేష్ వివరించారు.