: ఇన్ఫోసిస్ తో డీల్ రద్దు చేసుకున్న ఆర్బీఎస్... 3 వేల మంది ఉద్యోగాలకు ఎసరు!


ఇన్ఫోసిస్ సంస్థను స్థిరీకరించి, తిరిగి వృద్ధి బాటలో నిలపాలన్న విశాల్ సిక్కా ప్రణాళికలకు ఎదురు దెబ్బ తగిలింది. యూకేలో విడిగా బ్యాంకును ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్న రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్బీఎస్) అందుకు సాంకేతిక భాగస్వామిగా ఇన్ఫోసిస్ ను ఎంచుకుని, ఇప్పుడా ప్రాజెక్టును రద్దు చేసుకుంది. విలియమ్స్ అండ్ గ్లెన్ (డబ్ల్యూ అండ్ జీ) పేరిట స్టాండలోన్ బ్యాంకును కేవలం యూకేకు పరిమితం చేయాలని భావించిన ఆర్బీఎస్ కు సహకరించేలా దాదాపు 3 వేల మంది ఇన్ఫోసిస్ టెక్కీలు పనిచేస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టు రద్దుతో వీరందరి ఉద్యోగాలూ ప్రమాదంలో పడ్డాయి. దీంతో పాటు దాదాపు 50 మిలియన్ డాలర్ల నష్టమూ వాటిల్లింది. క్లయింట్ల నుంచి వచ్చే ఆదాయం ఇప్పటికే అనిశ్చితిలో పడిందని ఇన్ఫోసిస్ భయపడుతున్న వేళ, ఈ డీల్ రద్దు సంస్థపై పెను ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020 నాటికి ఇన్ఫీ ఆదాయాన్ని 20 బిలియన్ డాలర్లకు చేర్చాలన్న విశాల్ సిక్కా లక్ష్యానికి ఈ తరహా ప్రాజెక్టుల రద్దు పెను అడ్డంకేనని వివరించారు. వాస్తవానికి ఆర్బీఎస్ తో డీల్ 2013 నుంచి నడుస్తుండగా, దీనిపై ఎన్నో వేల గంటల సమయాన్ని ఇన్ఫోసిస్ కేటాయించింది. చివరికి తాము కొత్త బ్యాంకు ఆలోచన విరమించుకుంటున్నట్టు ఆర్బీఎస్ నుంచి గత వారంలో సమాచారం ఇన్ఫీకి అందింది. ఇక ఈ పని కోసమే నియమించుకున్న 3 వేల మందినీ సమీప భవిష్యత్తులో దశలవారీగా ఇన్ఫోసిస్ తొలగిస్తుందని సమాచారం.

  • Loading...

More Telugu News