: నృత్య ప్రదర్శనకని చెప్పి డ్యాన్సర్ ను తీసుకెళ్లి నలుగురు మేనేజర్ల సామూహిక అత్యాచారం
హోటల్ లో నృత్య ప్రదర్శన ఇవ్వాలని చెప్పి ముగ్గురు డ్యాన్సర్లను బుక్ చేసుకున్న ఓ ఆయుర్వేద ఔషధ కంపెనీ మేనేజర్ స్థాయి అధికారులు, ఓ డ్యాన్సర్ పై సామూహిక అత్యాచారం చేయగా, పోలీసులు వారందరినీ అరెస్ట్ చేశారు. అత్యాచార ఘటన ఆదివారం తెల్లవారుఝామున జరుగగా, సాయంత్రానికి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నడుపుతున్న 25 సంవత్సరాల యువతి, డ్యాన్సర్ గానూ పనిచేస్తోంది. ఆమె వద్దకు సత్యవీర్ సింగ్ అనే వ్యక్తి వెళ్లి, హోటల్ పార్టీలో నృత్యం చేయాలని చెప్పాడు. దీంతో తనతో పాటు మరో ఇద్దరు యువతులను వెంట బెట్టుకుని ఆమె వెళ్లింది. అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో వీరి మద్యం మత్తు నషాళానికి ఎక్కడంతో, వికృత చేష్టలు మొదలయ్యాయి. వీరి వైఖరిని చూసిన డ్యాన్సర్లు తమ బ్యాగులు సర్దుకుని వెళ్లబోతుంటే, డబ్బు చెల్లింపు విషయం మాట్లాడేందుకు రావాలని సత్యవీర్ ఆమెను కోరాడు. దీంతో ఆయన బుక్ చేసుకున్న గదిలోకి వెళ్లిన డ్యాన్సర్ ను సత్యవీర్ తో పాటు భూషణ్ భారతి, దేవరాజ్ సింగ్, పరేష్ తోమర్ అనే ముగ్గురూ అత్యాచారం చేశారు. అనంతరం వారి బారి నుంచి ఎలాగోలా బయటపడి బంతారా పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు, నిందితుల ఫోన్ నంబర్లను ట్రేస్ చేసి సాయంత్రానికి అరెస్ట్ చేశారు. లైసెన్స్ లేకపోయినా డ్యాన్స్ పార్టీకి అనుమతించిన హోటల్ మేనేజర్ నూ కటకటాల్లోకి పంపారు. అరెస్టయిన నలుగురూ ఆయుర్వేద ఔషధ సంస్థలో మేనేజర్ స్థాయి అధికారులని పోలీసులు తెలిపారు.