: పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ఉంటాం: కేసీఆర్
రెండేళ్ల క్రితమే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాల్సి వుందని, అందుకోసం కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ఉంటామని కేసీఆర్ తెలిపారు. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నేషనల్ హైవేల విషయంలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందని, విషయాన్ని పలుమార్లు కేంద్రం వద్ద ప్రస్తావిస్తే, సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు 2,592 కి.మీ జాతీయ రహదారి మాత్రమే ఉండగా, ఈ రెండేళ్లలో కొత్తగా 1951 కి.మీ జాతీయ రహదారిని మంజూరు చేయించుకున్నామని, దీంతో నేషనల్ హైవేల పొడవు 4,500 కి.మీలకు చేరుకుందని అన్నారు. తెలంగాణలో కేజీ టూ పీజీ ఉచితంగా అందించేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే హాస్టళ్లలో సన్న బియ్యంతో వండిన అన్నాన్ని అందిస్తున్నామని, ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ, వర్శిటీ హాస్టళ్లకు సైతం సన్నబియ్యాన్నే అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో నిత్యమూ 40 లక్షల మందికి సన్నబియ్యంతో అన్నం పెడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.