: సిట్ అదుపులో ‘నయీమ్’ మాజీ ఖాకీ మిత్రులు!... తెలంగాణలో ముగ్గురు, ఏపీలో ఒకరు!


గ్యాంగ్ స్టర్ నయీమ్ గుట్టు విప్పేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిన్న కీలక అడుగు వేసింది. నయీమ్ బతికి ఉండగా... అతడితో సంబంధాలు నెరపిన పోలీసు అధికారుల చుట్టూ సిట్ ఉచ్చు బిగించింది. ఇప్పటికే నలుగురు మాజీ పోలీసు అధికారులను సిట్ అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిట్ అదుపులోకి వెళ్లిన నలుగురు మాజీ ఖాకీల్లో... ముగ్గురు తెలంగాణ వారు కాగా ఓ మాజీ పోలీస్ ఏపీకి చెందిన వారట. విజయవాడలో ఏసీపీ స్థాయి అధికారిగా పనిచేసి ఆరేళ్ల క్రితం పదవీ విమరణ చేసిన సదరు పోలీసు అధికారిని నిన్న సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఇక హైదరాబాదులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు... నగర శివారులో మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నయీమ్ డైరీలో ఉన్న వివరాల ఆధారంగానే సిట్ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. త్వరలోనే వీరి అరెస్ట్ ను ప్రకటించేందుకు కూడా సిట్ సన్నాహాలు చేస్తున్నట్టు వినికిడి. విజయవాడలో పనిచేసి రిటైరైన మాజీ పోలీసు అధికారిని అదుపులోకి తీసుకునేందుకు నిన్న సిట్ అధికారులు అక్కడికి వెళ్లారన్న వార్తలు ఏపీ పోలీసు శాఖలో పెను కలకలమే రేపాయి. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో నల్లగొండ జిల్లాలో సీఐగా పనిచేసిన సదరు అధికారి... నాడు ఆ జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎస్ కు నయీమ్ నుంచి పెద్ద ఎత్తున మూటలు మోసారట. పనిలో పనిగా తన వాటా కూడా ఆయన తీసుకున్నారట. ఈ క్రమంలోనే సదరు అధికారిని సిట్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News