: దేశంగా గుర్తింపు లేని పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం ఎందుకు జరుపుకుంటుందో?: శివసేన


ఉగ్రవాదులకు స్థావరంగా తప్ప ఓ దేశంగా గుర్తింపులేని పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటుందో అర్థం కావడం లేదని శివసేన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన శివసేన అతడిని 24 గంటల్లోనే దేశం నుంచి పంపించివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసి మాట్లాడిన బాసిత్ కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం తమ మద్దతు కొనసాగిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్, శివసేన మండిపడ్డాయి. వెంటనే ఆయనను దేశం నుంచి పంపించివేయాలని డిమాండ్ చేశాయి. ‘‘ఢిల్లీలో కూర్చుని ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులను ఉపేక్షించడం తగదు. 24 గంటల్లో ఆయనను ఇస్లామాబాద్ పంపించాల్సిందే. భారత స్వాతంత్ర్య దినోత్సవానికి 24 గంటల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించదగ్గవే. ఈ విషయంలో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా’’ అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రవుత్ అన్నారు. పాకిస్థాన్ అసలు దేశమే కాదని, అదో ఉగ్రవాదుల స్థావరమని పేర్కొన్న రవుత్ పాక్ ఇండిపెండెన్స్ డేను జరుపుకోవడం ఆశ్చర్యకరమన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా పాక్ దౌత్యవేత్తపై మండిపడింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు పాక్ హైకమిషన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి డిమాండ్ చేశారు. కశ్మీర్‌పై కుట్రలకు పాల్పడుతున్న పాకిస్థాన్ వందకోట్ల సంవత్సరాల తర్వాత కూడా కశ్మీర్‌ను సొంతం చేసుకోలేదని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News