: మహనీయుల త్యాగఫలమే స్వాతంత్ర్యం... పటేల్ దేశాన్ని ఒక్కటి చేశారు!: ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ
భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఎందరో మహనీయులు చేసిన త్యాగఫలమే ఈ స్వాతంత్ర్యమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి ముందు ముక్కలుగా ఉన్న దేశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకం చేశారన్నారు. సంస్కృతీ సంప్రదాయాలకు భారత్ పుట్టినిల్లని చెప్పారు. దేశం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందన్నారు. భారత్ కు వేల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. స్వరాజ్యాన్ని సురాజ్యం చేసే బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కుంటోందని చెప్పిన మోదీ... ఆ సమస్యలను అధిగమించే సత్తా కూడా దేశానికి ఉందన్నారు. వైద్య వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశామని చెప్పిన ఆయన... ఒక్క నిమిషంలో 15 వేల టిక్కెట్లిచ్చేలా రైల్వేలను ఆధునికీకరించామన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేర్చాల్సిన బాధ్యత కూడా దేశ ప్రజలపై ఉందన్నారు. సాంకేతిక పరిఙ్ఞానాన్ని వినియోగించుకుంటూ దేశ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. భారత్ భిన్నంలో ఏకత్వం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.