: పుష్కరాలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష!
కృష్ణా పుష్కరాల నిర్వహణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్కర ఏర్పాట్లు, పాల్గొన్న భక్తులు, భద్రతా చర్యలపై అధికారులు సమగ్ర సమాచారం అందించారు. పుష్కరాలు శుక్రవారం ప్రారంభం కాగా, ఆదివారం మధ్యాహ్నం వరకు సుమారు 40,74,473 మంది భక్తులు పుష్కరాల్లో పుణ్యస్నానమాచరించారని తెలిపారు. కేవలం ఆదివారం వేకువ జాము నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 24,55,908 మంది భక్తులు పుష్కర పుణ్యస్నానమాచరించారని తెలియజేశారు. పుష్కర స్నానం పూర్తి చేసుకున్న భక్తులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటున్నారని, దీంతో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగిందని వారు పేర్కొన్నారు. ఆదివారం ఒక్కరోజే మధ్యాహ్నం వరకు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని వారు సీఎంకు వివరించారు.