: కాంగ్రెస్ వాళ్లూ ఆహ్వానించారు... నా భర్త మాత్రం ఆప్ వైపే మొగ్గారు: సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్


నేడో రేపో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పంజాబ్ సీఎం అభ్యర్థిగా మాజీ క్రికెటర్, ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన నవజ్యోత్ సింగ్ సిద్దూ పేరును ప్రకటిస్తారని వార్తలు వస్తున్న వేళ, ఆయన భార్య ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ మీడియా ముందుకు వచ్చారు. తన భర్తను కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించిందని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ అయితేనే బాగుంటుందని ఆయన భావించారని తెలిపారు. "కాంగ్రెస్ కూడా మమ్మల్ని సంప్రదించింది. అయితే, కెప్టెన్ అమరీందర్ కు, ప్రస్తుతం పాలిస్తున్న బాదల్ కు పెద్దగా తేడా లేదు. ఇద్దరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మేము పంజాబ్ లో మార్పును కోరుకుంటున్నాం" అన్నారామె. గడచిన పదేళ్లలో అకాళీలకు వ్యతిరేకంగా అమరీందర్ సింగ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పూర్తి కాని ప్రాజెక్టులు 11 ఉన్నాయని, అత్యంత కీలకమైన, దేశ భద్రతకు ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయని ఆమె చెప్పారు. అట్టారీ బార్డర్ చెక్ పోస్టు వద్ద సీసీటీవీ కెమెరాలు, స్కానర్ల ఏర్పాటు పూర్తి కాలేదని ఆమె ఆరోపించారు. 2015 ఎన్నికల వేళ, కేజ్రీవాల్ ను తీవ్ర విమర్శలు చేసిన సిద్దూ వీడియోలు హల్ చల్ చేస్తుండటంపై నవజ్యోత్ స్పందించారు. దీన్ని చాలా తేలికగా తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయన తను నమ్మిన విషయంపై నిబద్ధతతో ఉంటారని, ప్రధాని నరేంద్ర మోదీ అంటే, ఇప్పటికీ గౌరవం ఉందని, అయితే, బీజేపీ పార్టీ పైనే నమ్మకం పోయిందని అన్నారు. ఓ వ్యక్తిగా కేజ్రీవాల్ అంటే తన భర్తకు ఎంతో గౌరవం ఉందని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News