: న‌యీమ్ వేషాలు కూడా మార్చేవాడు!: న‌యీమ్ కేసుపై కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన సిట్ చీఫ్‌


న‌యీమ్ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు 20 మందిని అరెస్టు చేసిన‌ట్లు సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. రాజేంద్ర‌న‌గ‌ర్ ఏసీపీ కార్యాల‌యంలో ఈరోజు అధికారులతో న‌యీమ్ కేసుపై నాగిరెడ్డి సుమారు ఏడు గంట‌ల పాటు చ‌ర్చించారు. అనంత‌రం మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ... పోలీసుల నుంచి త‌ప్పించుకునేందుకు న‌యీమ్ వేషాలు కూడా మార్చేవాడని తెలిపారు. న‌యీమ్‌కు పెద్ద ఎత్తున‌ ఆయుధాలు ఎక్క‌డి నుంచి అందాయ‌న్న విష‌యంపై ఆరాతీస్తున్న‌ట్లు పేర్కొన్నారు. న్యాయస్థానం అనుమ‌తి కోరి న‌యీమ్ ఇళ్ల‌ను స్వాధీనం చేసుకుంటామ‌ని చెప్పారు. ఇద్ద‌రిని న‌యీమ్ హ‌త్య చేసిన‌ట్లుగా అత‌డి అనుచ‌రులు పోలీసుల‌తో చెప్పారని నాగిరెడ్డి తెలిపారు. ప‌లువురు న‌యీమ్‌ అనుచ‌రుల‌ను క‌స్ట‌డీలోకి ఇవ్వ‌మ‌ని కోర్టును తాము కోరిన‌ట్లు పేర్కొన్నారు. సిట్ కంట్రోల్ నెంబ‌రుకి న‌యీమ్ ఆగ‌డాల‌పై ఇప్ప‌టికే 60 ఫోన్ కాల్స్ వ‌చ్చాయని, న‌యీమ్ వ‌ల్ల నష్ట‌పోయిన‌ట్లు ఫిర్యాదు చేశారని ఆయ‌న పేర్కొన్నారు. త‌మ‌కు లభించిన ఆధారాల‌తోనే కేసు ద‌ర్యాప్తు జ‌రుగుతుందని చెప్పారు. న‌యీమ్ గురించి ర‌హ‌స్యాలు చెప్పిన వారి వివ‌రాలు గోప్యంగా ఉంచుతామ‌ని ఆయన పేర్కొన్నారు. ద‌ర్యాప్తు స‌మ‌యంలో న‌యీమ్‌కు సంబంధించి 20 ఇళ్ల‌లో సోదాలు చేసిన‌ట్లు తెలిపారు. న‌యీమ్ కేసుపై దర్యాప్తు ముమ్మ‌రంగా జ‌రుగుతోంద‌ని, ఆయ‌న‌పై ప‌లు పోలీస్‌స్టేష‌న్లో ఫిర్యాదు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ద‌ర్యాప్తులో న‌యీమ్‌కు సంబంధించి ఎన్నో విష‌యాలు ఇప్పటికే వెలుగులోకొచ్చాయ‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News