: బీజేపీ ఆఫీసులో ఏసీ పనిచేయట్లేదు!... ప్రెస్ మీట్ వేదిక మార్పునకు కారణం చెప్పిన దినేశ్ రెడ్డి!
మాజీ డీజీపీ, బీజేపీ నేత వి.దినేశ్ రెడ్డి మీడియా సమావేశం ఎట్టకేలకు గంట తర్వాత హైదరాబాదు, లకడీకాపూల్ లోని అశోకా హోటల్ లో ప్రారంభమైంది. తొలుత నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేటి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు దినేశ్ రెడ్డి మీడియాకు ఆహ్వానం పంపారు. అయితే చివరి నిమిషంలో మీడియా సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన నుంచి మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. ఆ వెంటనే సదరు సమావేశాన్ని రద్దు చేయలేదని... బీజేపీ ఆఫీస్ నుంచి అశోకా హోటల్ కు మారుస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. అయితే వేదిక ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న విషయాన్ని ప్రకటనలో చెప్పని దినేశ్ రెడ్డి... అశోకా హోటల్ లో మీడియా సమావేశం ప్రారంభం కాగానే కారణం చెప్పేశారు. బీజేపీ ఆఫీస్ లో ఏసీ పనిచేయని కారణంగానే మీడియా సమావేశం వేదిక మార్చామని ప్రకటించారు. ఏసీ లేని చోట మీడియా సమావేశం ఇబ్బందిగా ఉంటుందన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.