: పేరుకే పెళ్లి!... జరిగేదంతా అమ్మాయిల విక్రయమే!: శంషాబాదులో బయటపడ్డ నయా దందా!
నిజమే... అక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా పెళ్లిలానే కనిపిస్తుంది. మరింత లోతుకు వెళ్లి చూస్తే మాత్రం అదంతా... అమ్మాయిలను అంగడి బొమ్మల్లా విక్రయించేస్తున్న నయా దందా. తెలంగాణలో వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ చీకటి దందా రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాదులో వెలుగుచూసింది. రాజస్థాన్ కు చెందిన కొందరు వ్యక్తులు పాలమూరు జిల్లా ప్రజల అమాయకత్వాన్ని అసరా చేసుకుని సాగిస్తున్న ఈ దందాను శంషాబాదు స్థానికులు వెలుగులోకి తెచ్చారు. అంతేకాకుండా పోలీసుల సాయం లేకుండానే అన్యాయానికి గురి కాబోతున్న ఓ అమాయకురాలిని వారు కాపాడారు. పెళ్లి పేరిట తూతూమంత్రంగా తతంగాన్ని పూర్తి చేసుకుంటున్న రాజస్థాన్ వ్యక్తులు పాలమూరు జిల్లాకు చెందిన అమ్మాయిలను ఇప్పటికే పెద్ద సంఖ్యలో తమ రాష్ట్రానికి తరలించేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం మరో యువతిని వారు తీసుకెళుతుండగా అనుమానం వచ్చిన శంషాబాదు వాసులు వారిని అడ్డగించారు. కాస్తంత గట్టిగా ఆరా తీయడంతో ఈ చీకటి దందా వెలుగుచూసింది. రాజస్థాన్ వాసుల కబంద హస్తాలకు చిక్కిన యువతిని రక్షించిన శంషాబాదు వాసులు ఆ తర్వాత నిందితులను పోలీసులకు అప్పగించారు.