: పుష్కర ఆహ్వానంతో లోటస్ పాండ్ కు రావెల!... ఏపీ మంత్రితో భేటీకి వైఎస్ జగన్ ససేమిరా!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన సమయంలో ప్రభుత్వ ఆహ్వానానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ససేమిరా అన్నారు. తాజాగా అదే సీన్ మరోమారు రిపీట్ అయ్యంది. కృష్ణా పుష్కరాలకు రావాలంటూ ఆహ్వానం పలికేంందుకు వెళ్లిన ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబును కలిసేందుకు ఆయన ససేమిరా అన్నారు. దీంతో చేతిలో పుష్కర ఆహ్వానాన్ని పట్టుకుని లోటస్ పాండ్ కు వెళ్లిన రావెలతో పాటు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ నిరాశగా వెనుదిరిగారు. వివరాల్లోకెళితే... కృష్ణా పుష్కరాలకు హాజరుకావాలంటూ అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానాలు పలుకుతోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ ను ఆహ్వానించే బాధ్యతలు రావెలకు అప్పగించారు. అయితే, జగన్ ఢిల్లీ టూర్ కు వెళ్లిన కారణంగా మొన్నటిదాకా ఆయనకు పుష్కర ఆహ్వానం పలకడం కుదరలేదు. రిషికేశ్ లో పర్యటన ముగించుకుని నిన్న ఉదయం జగన్ హైదరాబాదు రానున్నారన్న సమాచారంతో... జగన్ ను కలిసేందుకు రావెల యత్నించారు. ఢిల్లీ నుంచి రాగానే జగన్ అమలాపురం వెళ్లనున్నారని, ఈ క్రమంలో ఆయనను కలవడం కుదరదని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. దీంతో సాయంత్రం దాకా వెయిట్ చేసిన రావెల నిన్న రాత్రి అమలాపురం నుంచి జగన్ హైదరాబాదు చేరుకున్నారని సమాచారం తెలుసుకుని పుష్కర ఆహ్వానం పట్టుకుని నేరుగా లోటస్ పాండ్ కు వెళ్లారు. అమలాపురంలో రోజంతా పర్యటించిన కారణంగా అలసిపోయిన జగన్ ను కలవడం ఇప్పుడు కుదరదంటూ వైసీపీ నేత పార్థసారధి చెప్పారట. దీంతో జగన్ కు పుష్కర ఆహ్వానం పలకకుండానే రావెల వెనుదిరిగారు.