: ఆ సినీ నటి వల్ల నా మొగుడు కనిపించకుండా పోయాడు: చెన్నైలో పోలీసులకు మహిళ ఫిర్యాదు
తమిళ సినీ నటిపై చెన్నైలోని విరుగంబాక్కం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మునివేల్ అనే ఏఐఏడీఎంకే కార్యకర్తకు 'సుందరం ట్రావెల్స్' అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాధ అనే నటితో పరిచయం ఉందని, అది హద్దులు మీరడంతో తనను వదిలేశాడని తెలిపింది. అయితే పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో తామిద్దరం కలిసి ఉంటున్నామని మునివేల్ భార్య ఉమాదేవి చెప్పింది. అయినప్పటికీ రాధ తన భర్తను విడిచిపెట్టడం లేదని, పలు మార్లు తమను వేధిస్తూనే ఉందని, తన భర్తకు నిరంతరం ఫోన్లు చేస్తూనే ఉందని, తనకి కూడా ఫోన్ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతోందని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. రాధ బెదిరింపులకు భయపడి తన కుమార్తె కాలేజీకి కూడా వెళ్లడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. ఇంతలా బెదిరిపోయిన తమకు రెండు రోజులుగా తన భర్త కనిపించకపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోందని తెలిపింది. తన భర్తను వెతికి తీసుకురావాలని ఆమె పోలీసులను కోరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాధ సన్నిహితులు మాత్రం అతను కనిపించకుండా పోవడానికి, రాధకు సంబంధం లేదని అంటున్నారు.