: శ్రీశైలం దాటి నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరదనీరు!
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టంతో పోలిస్తే మరో 11 అడుగులే ఖాళీగా ఉన్న వేళ, పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, బయటకు వస్తున్న నీరు నాగార్జున సాగర్ కు చేరుతోంది. శ్రీశైలానికి వస్తున్న వరద నీరు 2 లక్షల క్యూసెక్కులకు పైగానే ఉండటంతో, 66 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శుక్రవారం ఉదయం సాగర్ జలాశయంలోకి 64,100 క్యూసెక్కుల నీరు వస్తున్నట్టు నమోదైంది. సాగర్ జలాశయ నీటిమట్టం నెమ్మదిగా పైకి పెరగడం ప్రారంభం కావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలకు అవసరమైన నీటి కోసం 24,521 క్యూసెక్కుల నీటిని కిందకు వదలడం ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.