: మోకాళ్ల లోతు నీటిలో మునకెలా? 38 ఘాట్లకు రాని నీరు... జల్లు స్నానాల ఏర్పాటు.. భక్తుల తీవ్ర అసంతృప్తి


కృష్ణా పుష్కరాల్లో సంతృప్తిగా నదీ స్నానం చేద్దామని గంపెడాశతో వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. శ్రీశైలం నుంచి ఎగువకు నదిలో నీరున్నప్పటికీ, దిగువన ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ కింద ఏర్పాటు చేసిన ఏ ఘాట్ కు కూడా నీరు చేరని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు పైపుల ద్వారా జల్లు స్నానాలు చేసే ఏర్పాటు చేయగా, భక్తులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కనీసం 4 అడుగుల మేరకు నీరుంటే తప్ప ఓ మునక వేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చాలా ఘాట్లలో రెండడుగుల నీరు కూడా లేదు. మోకాళ్లలోతు నీటిలో మునకెలా వేయాలో తెలియక భక్తులు అవస్థలు పడుతున్నారు. నాగార్జున సాగర్ దిగువన దేశాలమ్మ, సత్రశాల పరిధిలో రెండు అడుగుల మేరకు నీరుండగా, దైదలో ఒక అడుగు మేరకు మాత్రమే నీరుంది. పులిచింతల ప్రాజెక్టు సమీపంలోని గోవిందాపురం, ఎల్లంపల్లి, రేగులగడ్డల్లో అసలు నీరే లేదు. ఇక ప్రకాశం బ్యారేజీలో 12 అడుగుల మేరకు నీరుండగా, దిగువ ఘాట్లకు కాస్తంత వదలడంతో, అది 10 అడుగులకు చేరింది. బ్యారేజ్ దిగువన పెనుమూడి ఘాట్ ను అర కిలోమీటర్ పొడవులో నిర్మించగా, భక్తుల స్నానాలకు చాలినంత నీరు వదలాలంటే, బ్యారేజ్ ఎగువన దుర్ఘా ఘాట్ కు నీరు చాలని పరిస్థితి నెలకొంది. బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో 38 ఘాట్లను అధికారులు ఏర్పాటు చేయగా, ఏ ఘాట్ దగ్గర కూడా నిండా మునిగేంత నీరు లేదు. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి నీరు వస్తేనే కానీ భక్తులు సంతృప్తిగా పుష్కర స్నానం చేయలేని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News