: ఐరిస్ స్కానర్, వాటర్ రెసిస్టెన్స్ తో శాంసంగ్ గెలాక్సీ నోట్-7... ధర చూస్తేనే గుండె గుబేలు!
తామందిస్తున్న 'నోట్' సిరీస్ లో శాంసంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేసింది. గెలాక్సీ నోట్ 7 పేరిట బయోమెట్రిక్ స్కానర్, ఐరిస్ స్కానర్, వాటర్ రెసిస్టెన్స్, అప్ గ్రేడ్ చేసిన ఎస్ పెన్, డ్యూయల్ కర్వ్ సదుపాయాలతో ఈ ఫోన్ ఉంటుందని సంస్థ సౌత్ వెస్ట్ ఆసియా అధ్యక్షుడు హెచ్సీ హాంగ్ వెల్లడించారు. ఈ ఫోన్ అమ్మకాలు సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. కాగా, దీని ధర చూస్తేనే స్మార్ట్ ఫోన్ యూజర్ల గుండె గుబేలనేలా ఉంది. యాపిల్ ఫోన్లకు ఏ మాత్రం తగ్గకుండా నోట్ 7 ధరను రూ. 59,900గా శాంసంగ్ నిర్ణయించింది. గోల్డ్ ప్లాటినమ్, సిల్వర్ ప్లాటినమ్, బ్లాక్ ఓనిక్స్ రంగుల్లో లభిస్తుంది. ఇంకా దీనిలో గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో పాటు 5.7 అంగుళాల క్యూహెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 1.5 మీటర్ల లోతు నీళ్లలో 30 నిమిషాల పాటు ఉంచినా ఏమీ దెబ్బతినదట. ఏ భాషనైనా ట్రాన్స్ లేట్ చేసే సదుపాయం, మ్యాగ్నిఫై సౌకర్యాలూ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ తో పాటు మరింత సెక్యూరిటీ కోసం ఐరిస్ స్కానర్ దీనికి అదనపు ప్రత్యేకత. 64 కోర్ ఆక్టా ప్రాసెసర్ తో పాటు, 64 గిగాబైట్ల ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ వరకు దాన్ని పెంచుకునే సామర్థ్యం, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 12/5 ఎంపీ కెమెరాలు ఉన్నాయని హాంగ్ వెల్లడించారు. ఇదే సమయంలో ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తూ, 1.5 జీబీ రామ్ కలిగున్న 'గేర్ ఫిట్2'ను రూ. 13,990కి, వీఆర్ హెడ్ సెట్ ను రూ. 7,290 ధరపై విడుదల చేయనున్నట్టు ఆయన వివరించారు.