: ఉమా మాధవరెడ్డి, నయీమ్ ల మధ్య వందల సంఖ్యలో ఫోన్ కాల్స్!... పక్కా ఆధారాలు సేకరించిన సిట్!
ఉమ్మడి రాష్ట్రానికి హోం మంత్రిగా పనిచేసి నక్సల్స్ విద్రోహ చర్యలో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి పేరుపై మరోమారు పెద్ద ఎత్తున చర్చకు తెర లేచింది. నాలుగు రోజుల క్రితం పాలమూరు జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ తో మాధవ రెడ్డి సతీమణి, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డికి ప్రత్యక్ష సంబంధాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఉమా మాధవరెడ్డిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నిన్న అలకాపురిలోని నయీమ్ ఇంటిలోని అతడి బెడ్ రూంలో సోదాలు చేసిన పోలీసులు... నయీమ్, ఉమా మాధవరెడ్డిల మధ్య సంబంధాలను రూఢీ చేసుకున్నట్లు సమాచారం. తనకు గతంలో ఆశ్రయమిచ్చిన ఉమా మాధవరెడ్డితో నయీమ్ చనిపోయే దాకా సత్సంబంధాలు కొనసాగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే ఆమెతో నయీమ్ వందల పర్యాయాలు ఫోన్ లో మాట్లాడాడు. ఉమా మాధవరెడ్డి సెల్ ఫోన్ తో పాటు ఆమె ఇంటిలోని ల్యాండ్ లైన్ కు కూడా నయీమ్ ఫోన్ చేశాడని పోలీసులు పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. దీనిపై మరికాసేపట్లో మరిన్ని వివరాలు వెల్లడి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.