: సానియా మీర్జాతో ఎందుకు విడిపోయానన్న విషయం చెప్పిన మార్టినా హింగిస్


మార్టినా హింగిస్ - సానియా మీర్జా... అభిమానులు ఈ జంటకు పెట్టుకున్న ముద్దు పేరు 'సాన్ టినా'. మార్చి 2015లో జత కట్టిన వీరిద్దరూ మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సహా, ఈ 16 నెలల్లో 14 పోటీల్లో విజయం సాధించి, మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ సీడింగ్ ను పొందారు. తాజాగా వీరిద్దరి జోడీ విడిపోయింది. ఇక తామెందుకు విడిపోవాల్సి వచ్చిందన్న విషయమై హింగిస్ వివరణ ఇచ్చింది. "మూడు గ్రాండ్ స్లామ్, 11 డబ్ల్యూటీఏ టైటిల్స్ తరువాత మేమిద్దరమూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఈ సీజనులో ఇతర క్రీడాకారిణులతో కలసి ఆడుతాం. గతంలో వచ్చిన మంచి ఫలితాలతో మాపై అభిమానుల అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దురదృష్టవశాత్తూ, గత కొంతకాలంగా ఆ స్థాయిలో ప్రదర్శనను కనబరచలేక పోయాము. మేము తీసుకున్న నిర్ణయం కేవలం ప్రొఫెషనల్ నిర్ణయమే. మా వ్యక్తిగత సంబంధం, స్నేహం ఎప్పటికీ కొనసాగుతాయి. అక్టోబరులో సింగపూర్ లో జరిగే డబ్ల్యూటీఏ పోటీలో కలసి ఆడి, గత సంవత్సరపు టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తాం. అప్పటికైనా మాపై వస్తున్న పుకార్లు ఆగుతాయేమో. మాపై కథలు అల్లేందుకు ఓ వర్గం మీడియా నిత్యమూ ప్రయత్నిస్తోంది. ఈ చర్యలు ఆపాలి" అని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో హింగిస్ తెలిపింది.

  • Loading...

More Telugu News